HCLTech – TIME | భారత్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్’కు టైమ్ మ్యాగజైన్లో చోటు దక్కింది. ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీల జాబితాలో ‘నంబర్ వన్ భారత్ కంపెనీ’ కింద హెచ్సీఎల్ టెక్కు స్థానం లభించింది. ప్రొఫెషనల్ సర్వీసెస్ క్యాటగిరీలో గ్లోబల్ టాప్-10 సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ‘శ్రేష్ఠత, ఆవిష్కరణల దిశగా హెచ్సీఎల్ టెక్ నిబద్ధతకు ఇది నిదర్శనం. ఐటీ రంగంలో టాప్ యాజమాన్యంగా మా సంస్థ నాయకత్వానికి తగిన గుర్తింపు’ అని హెచ్సీఎల్ టెక్ పేర్కొంది. ‘ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు సుస్థిర లక్ష్యాల సాధనలో సామాజిక, కమ్యూనిటీ బాధ్యతలను నిర్వర్తించడానికి మేం అంకితమై ఉన్నాం’ అని హెచ్ సీఎల్ టెక్ కార్పొరేట్ ఫంక్షన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాహుల్ సింగ్ పేర్కొన్నారు.
ఉద్యోగుల సంతృప్తి, రెవెన్యూ వృద్ధి, సుస్థిరత తదితర అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 2024లో ఉత్తమ కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ ఖరారు చేసింది. దాని ప్రకారం హెచ్ సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,257 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 20.45 శాతం ఎక్కువ. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ 6.6 శాతం వృద్ధితో రూ.28,057 కోట్ల ఆదాయం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 2.19 లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3-5 శాతం రెవెన్యూ గైడెన్స్ ఉంటుందని అంచనా వేసింది హెచ్సీఎల్ టెక్.