న్యూఢిల్లీ, జూలై 12: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,283 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,213 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 2.4 శాతం పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం అధికమై రూ. 23,464 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.20,068 కోట్లుగా ఉన్నది. 2022-23లో ఆదాయం 12-14 శాతం మేర వృద్ధి సాధించనున్నదని గైడెన్స్‌లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశాజనక పలితాలతో ప్రారంభించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయ కుమార్ తెలిపారు. సేవల రంగం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నదని, డిజిటల్ ఇంజినీరింగ్, డిజిటల్ అప్లికేషన్ సేవలు కూడా ఆశాజనక పనితీరు కనబరిచాయన్నారు.
వ్యాపారంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకంగా మారింది. క్లయింట్లు డిజిటల్‌కు పెద్దపీట వేస్తుండటంతో హెచ్‌సీఎల్ వీటిని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.’
– రోష్నీ నాడర్, హెచ్‌సీఎల్ చైర్పర్సన్