ముంబై, జూలై 27: దేశీయ మహిళ కుబేరుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా తొలిస్థానంలో నిలిచారు. 2021 సంవత్సరానికిగాను కొటక్ మహీంద్రా బ్యాంక్-హురున్ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో ఆమె సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో దేశీయ మహిళ సంపన్నవర్గాల జాబితాలో వరుసగా రెండోసారి తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో ఫల్గునీ నాయర్ దక్కించుకున్నారు. బ్యాంకింగ్ పెట్టుబడిదారుగా తన కేరియర్‌ను ప్రారంభించి ఫల్గునీ నాయర్..బ్యూటీ సంస్థ నైకాను ఏర్పాటు చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడంతో ఆమె సంపద రాకెట్ వేగంతో దూసుకుపోయింది. గతేడాదికిగాను రూ.57,520 కోట్ల నికర సంపదతో ఆమె ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.
59 ఏండ్ల వయస్సు కలిగిన నాయర్..గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆమె సంపద 963 శాతం ఎగబాకింది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా సంపద మాత్రం 21 శాతం తగ్గినప్పటికీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. రూ.29,030 కోట్ల నికర విలువ కలిగివున్నారు. భారత్‌లో పుట్టి లేదా ఇక్కడ పెరిగిన 100 మంది మహిళా సంపన్న వర్గాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ వందమంది మహిళల నికర సంపద 53 శాతం ఎగబాకి రూ.4.16 లక్షల కోట్లకు చేరుకున్నది. 2020లో ఇది రూ.2.72 లక్షల కోట్లుగా ఉన్నది. దేశ జీడీపీలో వీరి సంపద 2 శాతంగా ఉన్నది. రూ.300 కోట్లకు పైగా సంపద ఉన్నవారితో ఈ జాబితాను రూపొందించింది.
హైదరాబాద్ నుంచి 12 మంది మహిళలు
ఈ మహిళ కుబేరుల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన 12 మంది మహిళలకు చోటు లభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజన్ నుంచి 25 మంది ఉండగా, ముంబై నుంచి 21 మంది ఉండటం విశేషం. మరోవైపు, ఫార్మాస్యూటికల్స్ నుంచి 12 మందికి, కన్జ్యూమర్ గూడ్స్ నుంచి 11 మంది కొత్తగా చోటు దక్కించుకున్నారు. అలాగే ప్రొఫెషనల్ మేనేజర్ జాబితాలో పెప్సీకో మాజీ చీఫ్ ఇంద్రానూయ్ స్థానం సంపాదించుకున్నారు. ఆమె సంపద రూ.5,040 కోట్లు
అపోలో నుంచి నలుగురు
దేశీయ హెల్త్‌కేర్ రంగంలో సత్తాచాటుతున్న అపోలో సిస్టర్స్ మరో ఘనత సాధించారు. దేశీయ శ్రీమంతురాలుల జాబితాలో ఈ నలుగురు సిస్టర్స్ చోటు లభించడం విశేషం. ఒక కంపెనీ నుంచి నలుగురికి చోటు లభించడం కూడా ఇదే తొలిసారి. అలాగే మెట్రో షూస్, దేవీ సీ ఫుడ్స్‌ల నుంచి ఇద్దరు చోటు లభించింది. అలాగే ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్సురాలు భూపాల్‌కు చెందిన 33 ఏండ్ల వయస్సు కలిగిన కనిక టెక్రియాల్.