GST Receipts in June | జీఎస్టీ వసూళ్లలో జూన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జీఎస్టీ హయాం మొదలైన ఐదేండ్లలో గత నెల వసూళ్లు రెండో గరిష్ఠ స్థాయికి చేరాయి. పరోక్ష పన్ను వసూళ్లు 56 శాతం పెరిగి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. కరోనా రెండో వేవ్ ఉధృతి ప్రభావంతో గతేడాది రూ.92,800 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అయితే, గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్ల వసూళ్లు జరిగిన సంగతి తెలిసిందే. మార్చిలో ఎరియర్ల చెల్లింపుల వల్ల సాధారణంగానే ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు ఎక్కువగా ఉంటాయి.
రూ.1.40 లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు జరుగడం ఇది వరుసగా నాలుగో నెల. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు ఎక్కువ కావడానికి వృద్ధిరేటు సంకేతాలే కారణం అని తెలుస్తున్నది. ప్రభుత్వం పాలనాపరమైన చర్యలు తీసుకోవడం వల్లే ఆర్థిక రివకరీ సాధించగలిగామని కేంద్రం తెలిపింది.
ఆర్థిక రికవరీతోపాటు పన్ను ఎగవేత చర్యలు ప్రత్యేకించి బూటకపు బిల్లులు దాఖలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం వల్లే జీఎస్టీ వసూళ్లు పెరిగిపోయాయని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటున ప్రతి నెలా రూ.1.51 లక్షల కోట్లు వసూలయ్యాయి. బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు 37 శాతం పెరిగాయి. జూన్ నెలలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లలో కనీసం 50 శాతం పెరుగుదల నమోదైంది.