GST | క్యాన్సర్ రోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందుల ధరలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం నిర్మలా సీతారామన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్యాన్సర్ మందులతో పాటు స్నాక్స్‌పై జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు తెలిపారు. వాణిజ్య ఆస్తులను అద్దెకు ఇవ్వడం రివర్స్ ఛార్జ్ మెకానిజం కిందకు తీసుకువస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించామని.. దాంతో ఖర్చును మరింత తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎంపిక చేసిన స్నాక్స్‌పై పన్నును 18శాతం నుంచి 12శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని చెప్పారు. ఇక ఆన్లైన్ గేమింగ్ ఆదాయం ఆరు నెలల్లో 412శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకుందని తెలిపారు. రేట్ల హేతుబద్ధీకరణపై జీఓఎం స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఒకటి రియల్ ఎస్టేట్, మరొకటి రేట్ల హేతుబద్ధీకరణపై స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉందన్నారు. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల స్థితిగతులను సైతం కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. క్యాసినో ఆదాయం 30శాతం పెరిగిందని తెలిపారు. ఆరోగ్య బీమాపై మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదికను సమర్పిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆరోగ్య బీమాపై జీఎస్టీని ఎత్తివేసే నిర్ణయం తీసుకోలేదని.. నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామన్నారు. ఆరోగ్య బీమాపై రేటును అంచనా వేయడానికి జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మంత్రుల బృందం అక్టోబర్ చివరి నాటికి నివేదిక అందజేస్తుందని వివరించారు. అంతేకాకుండా మతపరమైన తీర్థయాత్రల కోసం హెలికాప్టర్ సేవల నిర్వహణపై పన్నును ఐదు శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేదార్నాథ్, బద్రీనాథ్ తదితర తీర్థయాత్రలకు భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సేవలపై పన్ను 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఇంతకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2వేల వరకు చిన్న డిజిటల్ లావాదేవీల కోసం బిల్‌డెస్క్, సీసీ ఎవెన్యూ తదితర చెల్లింపు అగ్రిగేటర్లపై (PA) 18 శాతం జీఎస్టి విధించే అంశాన్ని కౌన్సిల్ సిఫార్సు కమిటీకి సూచించిందని అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం, అగ్రిగేటర్లు రూ.2వేల కంటే తక్కువ లావాదేవీలపై జీఎస్టీ మినహాయించారు.