న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 57వ జీఎస్టీ మండలి(GST Council) సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమె మీడియాకు వెల్లడించారు. జీఎస్టీ ఆఫీసర్లకు ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఇక జీఎస్టీ కింద చర్యలు తీసుకునేందుకు పరిమితిని కోటి నుంచి 5 కోట్లకు పెంచినట్లు ఆమె చెప్పారు. జీఎస్టీ రేటు విధానాన్ని పరిష్కరించామని, రోజువారిగా పన్ను విధానం సాగే తీరును జీఎస్టీ మండలి ఆమోదించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నుంచి జీఎస్టీ రేట్లలో మార్పులు ఏడాదికి ఒకేసారి ఉంటాయని ఆమె అన్నారు.
సరైన ఇన్వాయిస్ కలిగి ఉన్న నిజమైన వినియోగదారుడిని ఎలా రక్షించాలన్న కోణంలో జీఎస్టీ మండలిలో చర్చ జరిగిందని, దీని కోసం ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అయితే ఆ కమిటీ మూడు నెలల పాటు స్టడీ చేస్తుందని, వచ్చే మండలి మీటింగ్లో తమ నిర్ణయాలను కమిటీ వెల్లడిస్తుందని మంత్రి నిర్మల తెలిపారు. జీఎస్టీ ఆఫీసర్లకు ఉన్న ప్రత్యేక అరెస్టు అధికారాలను రద్దు చేసేందుకు జీఎస్టీ మండలి అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. జీఎస్టీ కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు 5 కోట్ల వరకు పరిమితిని పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి కేసులోనూ శిక్ష అనేది చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఇక సాధారణ పెనాల్టీని మాత్రం 25 వేల నుంచి 10 వేలకు తగ్గించారు.