పానిపట్, ఫిబ్రవరి 22: ఆదిత్యా బిర్లా గ్రూపు తాజాగా పెయింట్స్ రంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా పెయింట్ల పరిశ్రమ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో ఈ రంగంలోకి ప్రవేశించినట్లు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. వచ్చే మూడేండ్లకాలంలో ఈ రంగుల పరిశ్రమలో రూ.10 వేల కోట్ల ఆదాయంతోపాటు లాభాలు ఆర్జించగలిగే స్థాయికి ఎదుగుతామని ఆయన అన్నారు. బిర్లా ఓపస్ పేరుతో ఈ రంగులను విక్రయిస్తున్నది సంస్థ. అంతర్జాతీయంగా ఏ సంస్థ కూడా ఒకేరోజు ప్లాంట్‌ను, ఆపరేషన్స్, ఉత్పత్తి, సేవలను ప్రారంభించలేదని, కానీ, ఆదిత్యా బిర్లా గ్రూపు ఈ రికార్డును సొంతం చేసుకున్నదన్నారు.
రంగులను ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా ఒకేసారి మూడు ప్లాంట్లను ప్రారంభించింది ఆదిత్యా బిర్లా గ్రూపు. పానిపట్(హర్యానా), లుధియానా(పంజాబ్), చెయ్యర్(తమిళనాడు)లలో ఈ మూడు ప్లాంట్లను ఆరంభించింది. ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్..డెకరేటివ్ పెయింట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు గతేడాది ప్రకటించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఆరు తయారీ కేంద్రాలను 2025 వరకు ఏర్పాటు చేయబోతున్నది. ఈ పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.5 వేల కోట్లను ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాతోపాటు పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్లో నెలకొల్పనున్న ప్లాంట్లలో ఏడాదికి 1,332 మిలియన్ టన్నులు కలర్స్‌ను ఉత్పత్తి చేయనున్నది. గురువారం ఒకేరోజు మూడు ప్లాంట్లను ప్రారంభించిన సంస్థ..మిగతా మూడు ప్లాంట్లు వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల తొలివారం నుంచి బిర్లా ఓపస్ కలర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. రూ.80 వేల కోట్ల స్థాయిలో ఉన్న రంగుల పరిశ్రమలోకి ఆదిత్యా బిర్లా గ్రూపు ప్రవేశించినైట్లెంది. ప్రస్తుతం మార్కెట్లో ఏషియన్ పెయింట్స్, బర్గర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ బ్రాండ్లు ఉన్నాయి.