హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్రాన్యూల్స్ ఇండియా దూకుడు పెంచింది. కాంట్రాక్స్ రీసర్చ్-డెవలప్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్(సీడీఎంవో) విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన సెన్న్ కెమికల్స్ ఏజీని కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ స్విట్జర్లాండ్‌కు చెందిన కరెన్సీ సీహెచ్ఎఫ్ 20 మిలియన్లు. మన కరెన్సీలో రూ.192 కోట్లకు పైమాటే.
అంతర్జాతీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి, సీడీఎంవో సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు జరిపినట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కొనుగోలు ఒప్పందం ఈ ఏడాది తొలి అర్థభాగం నాటికి పూర్తికాగలదనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న థెరపెటిక్స్ సెగ్మెంట్‌తోపాటు సీడీఎంవో విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. చికిత్సా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.