Diesel Bus Ban | భూతాపాన్ని నివారించడానికి పర్యావరణ పరిరక్షణే ముఖ్యం. పర్యావరణం దెబ్బతినడానికి నిర్దేశిత స్థాయి కంటే కర్బన ఉద్గారాలు వెలువడటమే కారణం. ఇప్పటికే ప్రపంచదేశాలతోపాటు భారత్ కూడా కర్బన ఉద్గారాల నియంత్రణకు రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేస్తున్నది. మరింతగా కర్బన ఉద్గారాలను తగ్గించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర పెట్రోలియంశాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ సారధ్యంలోని కమిటీ ఈ మేరకు కీలక సూచనలు చేసింది. వచ్చే నాలుగేండ్లలో అంటే 2027 నాటికి పది లక్షల మందికి పైగా గల నగరాల్లో డీజిల్ వాహనాల వాడకంపై పూర్తి నిషేధం విధించాలని తేల్చి చెప్పింది. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ గ్యాస్ వినియోగ వెహికల్స్ వాడకానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అంతే కాదు వచ్చే 12 ఏండ్లలో.. 2035 నాటికి సంప్రదాయ ఇంజిన్లతో నడిపే మోటారు సైకిళ్లు, స్కూటర్లు, ఆటోలనూ దశల వారీగా.. పూర్తిగా తగ్గించాలని సూచిస్తూ గత ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది తరుణ్ కపూర్ కమిటీ. కానీ, దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇందుకోసం విద్యుత్ వాహనాల వాడకం ప్రోత్సహించాలని పేర్కొంది. అప్పటి వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ-పెట్రోల్) వాడకం వాటా పెంచాలని తెలిపింది.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఫేమ్ స్కీం కింద `టార్గెటెడ్ ఎక్స్టెన్షన్’ లక్ష్యంగా ఇన్సెంటివ్ లు కొనసాగించాలని కేంద్రానికి తరుణ్ కపూర్ కమిటీ సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా రవాణా రంగంలో 80 శాతం వాహనాల్లో డీజిల్ వాడుతున్నారు. దీర్ఘకాలంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను పూర్తిగా విద్ద్యుద్ధీకరించాలని సూచించింది. కార్లతోపాటు టాక్సీల్లో సగం ఇథనాల్ కలిపిన పెట్రోల్, సగం ఎలక్ట్రిక్ వాహనాలను వాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న ఎనర్జీ మిక్సింగ్.. 2030 నాటికి 15 శాతానికి చేరాలని భారత్ లక్ష్యం.
2070 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత దేశంగా నిలవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. 2070 లక్ష్యాల సాధనకు సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్రానికి కమిటీ సిఫారసు చేసింది. కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. తొలి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో ఈయూ దేశాలు ఉన్నాయి.
దేశీయంగా రెండు నెలల అవసరాలకు సరిపడా అండర్ గ్రౌండ్ గ్యాస్ స్టోరేజీ కట్టడాలు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, అందుకు విదేశీ గ్యాస్ ఉత్పాదక కంపెనీలకు భాగస్వామ్యం కల్పించాలని కేంద్రానికి తరుణ్ కపూర్ కమిటీ సిఫారసు చేసింది. 2020-2050 మధ్య సగటున గ్యాస్ వినియోగం 9.78 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.