Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో సంజీవ్ చద్దా పదవీ కాలాన్ని మరో ఐదు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన మూడేండ్ల పదవీ కాలం ఈ నెల 19న ముగియనున్నది. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ 30 వరకు సంజీవ్ చద్దా పదవీ కాలం పొడిగిస్తూ శనివారం కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం చేసిన సిఫారసులను కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించింది. జూన్ 30తో సంజీవ్ చద్దా రిటైర్మెంట్ వయస్సు 60 ఏండ్లకు చేరుకుంటారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న దేబదత్తా చంద్‌కు ఆ బ్యాంక్ ఎండీగా ప్రమోషన్ కల్పిస్తూ కేంద ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్ల నియామకాలు చేపడతున్న ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ).. కేంద్రానికి సిఫారసు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ రజనీష్ కర్నాటక్కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ కం సీఈవోగా పదోన్నతి కల్పించింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసులపై ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) తుది నిర్ణయం తీసుకోనున్నది.
ఎఫ్‌ఎస్‌ఐబీకి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) మాజీ కార్యదర్శి భానూ ప్రతాప్ శర్మ సారధ్యం వహిస్తున్నారు. ఈ బ్యూరోలో సభ్యులుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ అనిమేష్ చౌహాన్, ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ సింఘాల్, ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ మాజీ ఎండీ శైలేంద్ర భండారీ ఉన్నారు.