SBI Chairman | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు – భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) మంగళవారం నియమితులు అయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో అత్యంత సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సీఎస్ శెట్టి.. ఈ నెల 28న రిటైర్ కానున్న ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా స్థానంలో నియమితులయ్యారు.
కేంద్ర ఆర్థిక విభాగం ప్రతిపాదనకు కేంద్ర నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి చల్లా శ్రీనివాసులు శెట్టి మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఎస్బీఐ చైర్మన్గా నియమితులయ్యే వారు 63 ఏండ్ల వయస్సు వచ్చే వరకూ కొనసాగుతారు. ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టితోపాటు బ్యాంకు ఎండీగా రాణా అశుతోష్ కమార్ సింగ్ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం రాణా అశుతోశ్ కుమార్ సింగ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఎస్బీఐ చైర్మన్కు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహకరిస్తారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన పలు టాస్క్ ఫోర్స్ లు, కమిటీలకు చల్లా శ్రీనివాసులు శెట్టి సారధ్యం వహించారు. ఎస్బీఐలో ఆయన రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ పోర్ట్ ఫోలియో వ్యవహారాలను పర్యవేక్షించారు. ఏజీ బీఎస్ పూర్తి చేసిన చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ నుంచి సర్టిఫైడ్ అసోసియేట్ పట్టా అందుకున్నారు. 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. బ్యాంకులో ఆయనకు కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, సంపన్న దేశాల్లో బ్యాంకింగ్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు.