న్యూఢిల్లీ, ఆగస్టు 29 : అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న అప్పటిదాకా ఈ హోదాలో పనిచేసిన కేవీ సుబ్రమణ్యన్‌కు మోదీ సర్కారు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. నిజానికి ఆయన పదవీకాలం మూడేైండ్లెనా 6 నెలల ముందే తొలగించారు. అప్పట్నుంచి ఐఎంఎఫ్‌లో భారత్ తరఫున ఈడీ పోస్టు ఖాళీగానే ఉంటుండగా, దాన్ని పటేల్‌తో భర్తీ చేశారిప్పుడు.
ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ అనుమతుల్ని ఇచ్చింది. మూడేండ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఈ నియామకం అమల్లో ఉంటుందని గురువారం విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 25 మంది ఈడీలుంటారు. సభ్య దేశాలు లేదా ఆయా దేశాలతో కూడిన గ్రూపులు వీరిని ఎన్నుకుంటాయి. ఇదిలావుంటే ఇంతకుముందు ఏఐఐబీ పెట్టుబడి కార్యకలాపాల ఉపాధ్యక్షుడిగా ఉర్జిత్ పటేల్ పనిచేశారు. అయితే నిరుడు జనవరిలో కుటుంబ ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా రాజీనామా చేశారు.