Google Pay | ఇప్పుడు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ పేమెంట్స్ మరింత సులభంగా సాగేందుకు గూగుల్ పేమెంట్స్ యాప్ ‘గూగుల్ యాప్ (Google pay)’ తాజాగా మూడు సరికొత్త ఫీచర్లు ప్రవేశ పెట్టింది. పేమెంట్స్ చేసే ముందు క్రెడిట్ కార్డు కార్డు ప్రయోజనాలు, బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు వివరాలపై సెక్యూరిటీ వంటి సదుపాయాలు తెచ్చింది. క్రెడిట్ కార్డులు తీసుకున్న వారికి ప్రత్యేక రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఆన్ లైన్ కొనుగోళ్లు మొదలు విమాన ప్రయాణాలు, హోటళ్లలో బస వరకు .. ప్రతి క్రెడిట్ కార్డుపై ఏదో ఒక ఆఫర్ లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు.. నిర్దిష్ట కొనుగోళ్లపై ఏ క్రెడిట్ కార్డుతో అధిక రివార్డు పాయింట్లు వస్తాయో గుర్తు పెట్టుకోవడం కష్టం.
ఒక క్రెడిట్ కార్డుతో గ్రాసరీ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ లభిస్తే, మరో కార్డు ప్రయాణ టికెట్లపై మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఇటువంటప్పుడే గూగుల్ పే తెచ్చిన కొత్త ఫీచర్.. క్రెడిట్ కార్డు దారులకు సాయ పడుతుంది. ప్రతి క్రెడిట్ కార్డు బెనిఫిట్లను సొంతంగా చెక్ చేసే పని తప్పుతుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడే వారికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. డెస్క్ టాప్ క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ పేతో కొనుగోళ్లు జరుపుతున్నప్పుడు ఈ ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇప్పుడు కొనండి.. తర్వాత పే చేయండి (బై నౌ పే లేటర్ – బీఎన్‌పీఎల్) అనే ఆప్షన్ చాలా పాపులర్. అత్యవసరంగా ఏదైనా వస్తువును కొనుగోలు చేయాల్సి వస్తే మొత్తం చెల్లించకుండా తర్వాత పూర్తి మొత్తం గానీ, ఈఎంఐల రూపంలో గానీ పే చేసే వెసులుబాటే ఇది. ఈ సేవలు ప్రస్తుతం అమెరికాలో విస్తరించాయి. వస్తువుల కొనుగోలు టైంలో ఈ ఆప్షన్ వాడొచ్చు.
ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న ప్రతిసారీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలంటే చిరాకు కలుగుతుంది. దీనికోసం ‘ఆటోఫిల్’ అనే ఫీచర్ తెచ్చారు. ఆన్ లైన్ చెక్ అవుట్ సమయంలో మీ బిల్లింగ్, పే మెంట్ వివరాలు ఆటోమేటిక్‌గా రికార్డుచేసే ఫీచర్ ‘ఆటోఫిల్’. చెక్ అవుట్ సమయంలో సమయం ఆదా కావడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. అయితే ఈ ఫీచర్ వినియోగాన్ని గూగుల్ పే మరింత సురక్షితంగా మార్చేసింది. క్రోమ్ లేదా ఆండ్రాయిడ్ లోని ‘గూగుల్ పే’తో చెక్ అవుట్ సమయంలో ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్, లాక్ పిన్ ద్వారా మాత్రమే ఆటోఫిల్ కావడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల క్రెడిట్ కార్డు వాడకం దారుల వివరాలకు మరింత సేఫ్టీ లభిస్తుందని గూగుల్ పే పేర్కొంది.