Gold Rates | బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు భారీ ఊరటనిచ్చాయి. వరుసగా రెండో సెషన్లో ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.500 తగ్గి తులం ధర రూ.98,870కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర తగ్గి రూ.400 తగ్గి తులానికి రూ.98,400కి చేరుకుంది. వెండి ధర సైతం రూ.1000 తగ్గడంతో కిలో ధర రూ.1.11లక్షలకు పతనమైంది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 16.41 పెరిగి 3,341.37కి చేరుకుంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికల నేపథ్యంలో గోల్డ్ 3,346కి పెరిగింది. ఈ నెలాఖరు నాటికి ఫార్మారంగంపై సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
దాంతో పాటు సెమీ కండక్టర్లపై అదనపు సుంకాలు విధించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోన్నది. కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్‌తో సహా 25 దేశాలపై కొత్త సుంకాలు విధిస్తున్నందున రిస్క్ అపిటైట్ తక్కువగా ఉందని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏపీవీ కైనత్ చైన్వాలా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ వెండి దాదాపు 1 శాతం పెరిగి ఔన్సుకు 38.05 డాలర్లకు చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం బలపడుతుండగా.. వెండి తగ్గుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని వారాలుగా వెండి ఉత్పత్తులలో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో ముఖ్యంగా చైనాలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రూ.99,280 ఉండగా.. 22 క్యారెట్ల పుత్తడి రూ.91వేలుగా ఉన్నది. మరో వైపు వెండి రూ.1.24లక్షలు పలుకుతున్నది.