Gold Rate | బంగారం ధరలు శాంతిస్తున్నాయి. ఇటీవల రికార్డుస్థాయికి చేరిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మంగళవారం సైతం ధర స్వల్పంగా తగ్గింది. ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర రూ.100 తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.100 తగ్గి తులానికి రూ.90,450కి చేరింది. ఇక 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ వరుసగా నాలుగో సెషన్లో తగ్గింది. రూ.100 తగ్గడంతో తులం ధర రూ.90వేలకు దిగివచ్చింది. ఇక వెండి ధర సైతం రూ.500 తగ్గి కిలో రూ.లక్షకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ మాట్లాడుతూ.. యూఎస్ డాలర్ ట్రెజరీ దిగుబడల కారణంగా బంగారం ధరలు పెరిగాయని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సుకు 12.56 డాలర్లు పెరిగి.. 3,023.60కి చేరుకుంది. కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనాత్ చైన్వాలా మాట్లాడుతూ.. వాణిజ్య యుద్ధం భయాలు తగ్గడంతో బంగారం ధర ఔన్స్‌కు 3,020 డాలర్లకు చేరుకుందన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం తగ్గుదల పరిమితం కావొచ్చని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.300 తగ్గి తులానికి రూ.81,850 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి.. తులం రూ.89,290కి చేరింది. ఇక కిలో వెండి రూ.1.10లక్షలు పలుకుతున్నది. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.