Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం బుల్ పరుగులు తీస్తోంది. శుక్రవారం వరుసగా ఎనిమిదో రోజు 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో ఫస్ట్‌టైం రూ.83 వేల మార్క్‌ను దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితుల నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.200 పెరిగి రూ.83,100లతో తాజా జీవిత కాల గరిష్ట రికార్డు నమోదు చేసింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,900 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
శుక్రవారం లాభాలతో దేశీయ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర జీవిత కాల గరిష్టాన్ని తాకిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల వస్తువుల దిగుమతులపై విధించే సుంకాలు, ఇతర విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు బంగారం స్వర్గధామంగా మారిందని సౌమిల్ గాంధీ తెలిపారు. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో రూ.82,700 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.82,500 వద్ద ముగిసింది.
మరోవైపు, కిలో వెండి ధర శుక్రవారం రూ.500 వృద్ధి చెంది రూ.94,000 లకు చేరుకుంది. గత సెషన్లో కిలో వెండి ధర రూ.93,500 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.334 (0.42 శాతం) పెరిగి 79,960లకు చేరుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ. 424 (0.53శాతం) పుంజుకుని రూ.80,050లతో రికార్డు గరిష్టానికి చేరువైంది. గతేడాది అక్టోబర్ 30న ఎంసీఎక్స్‌లో తులం బంగారం రూ.80,282లతో రికార్డు గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి డెలివరీ కిలో వెండి ధర రూ. 835 పెరిగి రూ.91,984 వద్ద స్థిర పడింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం 15.50 డాలర్లు (0.56 శాతం) పెరిగి 2,780.50 డాలర్లకు చేరుకుంది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 1.53శాతం వృద్ధితో 31.32 డాలర్ల వద్ద ముగిసింది. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్, వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ తీసుకునే కీలక నిర్ణయాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు.