న్యూఢిల్లీ, మే 6: బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి బుధవారం భారీగా పెరిగింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో అతి విలువైన లోహాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర ఒకేరోజు రూ.2,900 ఎగబాకి రూ.1.55 లక్షలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో కూడా గోల్డ్ ధర రూ.2 వేల పైగా ఎగబాకింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,130 అందుకొని రూ.1,51,310 పలికింది.
అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,560 అందుకొని రూ.1,38,800కి చేరుకున్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.7 వేలు అధికమై రూ.2.54 లక్షలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో కిలో వెండి రూ.5 వేలు ఎగబాకి రూ.2.70 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 134.34 డాలర్లు అందుకొని 4,702.84 డాలర్లకు చేరుకోగా, వెండి 4 డాలర్లు అధికమై 77.66 డాలర్లకు చేరుకున్నది.