Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో సోమవారం భారత్‌లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.350 పెరిగి.. పది గ్రాములకు రూ.89,100కి పెరిగింది. దాంతో బంగారం రికార్డు స్థాయికి చేరుకుంది. మరో వైపు వెండి కిలోకు రూ.లక్ష పలుకుతున్నది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. శుక్రవారం బంగారం పది గ్రాములకు రూ.88,750 వద్ద ముగిసింది. సోమవారం బంగారం ధర రూ. 350 పెరిగి 10 గ్రాములకు రూ. 89,100కు చేరుకుంది. 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.350 పెరిగి 10 గ్రాములకు రూ.88,700కి చేరింది. విదేశీ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 2,954.71 డాలర్లు పలుకుతున్నది. స్పాట్ గోల్డ్ 5.50 డాలర్లు పెరిగి ఔన్సుకు 2,941.55 డాలర్లకు చేరుకుంది.
ట్రంప్ సుంకాలు, వాణిజ్య యుద్ధ భయాల ఆందోళన నేపళ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. యూఎస్ డాలర్ సైతం బంగారం ధర పెరిగేందుకు కారణమైందని చెప్పారు. డాలర్ ఇండెక్స్ వరుసగా మూడోవారం పతనమైందని చెప్పారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీస్-కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ కామెక్స్ బంగారం 2,925 డాలర్ల ఎగువన ట్రేడవుతోందన్నారు. రూపాయి బలహీనపడడంతో ఎంసీఎక్స్ బంగారానికి అదనంగా మద్దతు లభించినట్లు పేర్కొన్నారు. డాలర్ బలహీనం కారణంగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయని అబాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా పేర్కొన్నారు. సురక్షిత పెట్టుబడికి డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దానికి తోడు ఆర్థిక అస్థిరత, అనిశ్చితి నుంచి రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులన్నీ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం సైతం బంగారం పెరుగుదలకు కారణమని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆసియా మార్కెట్లలో వెండి ఫ్యూచర్ ఔన్స్‌కు 0.43శాతం తగ్గి ఔన్స్‌కు 33.20 డాలర్లకు చేరింది. ఇదిలా ఉండగా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.80,550 ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి రూ.87,870 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.80,550 ఉండగా.. 24 క్యారెట్స్ పుత్తడి రూ.87,870గా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి 22 క్యారెట్స్ గోల్డ్ రూ.80,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.87,870కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కిలో రూ.1.08లక్షలు పలుకుతున్నది.