Gold Rates | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడం, జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో గురువారం బంగారం, వెండి ధరలు ధగధగమెరుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.500 వృద్ధితో రూ.81,300లకు చేరుకున్నది. బుధవారం 99.9శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.80,800 వద్ద ముగిసింది. ఆభరణాలను తయారు చేసేందుకు వినియోగించే 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర సైతం రూ.500 పెరిగి రూ.80,900 వద్ద స్థిర పడింది. బుధవారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.80,400 వద్ద ముగిసింది. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.2,300 వృద్ధితో రూ.94,000లకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,700 వద్ద నిలిచింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గురువారం గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ (బంగారం తులం ధర) రూ.297 (0.38 శాతం), పెరిగి 79,007లకు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఎంసీఎక్స్‌లో బంగారం తులం ధర రూ.79వేల ఎగువన ట్రేడ్ అవుతున్నదని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ 16 పైసలు పతనమై రూ.86.56లకు పడిపోయింది. క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు ఉపసంహరించడంతో రూపాయి విలువ పతనమైంది. మరోవైపు, కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.654 (0.7 శాతం) వృద్ధితో రూ.93,510 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 19.70 డాలర్లు వృద్ధి చెంది 2,737.50 డాలర్లకు చేరుకుంది. అంచనాలకు అనుగుణంగానే డిసెంబర్ అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం వస్తుందన్న అంచనాల మధ్య బంగారానికి అదనపు మద్దతు లభించిందని జతిన్ త్రివేది తెలిపారు. అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇక మరోవైపు, ఆసియా మార్కెట్ ట్రేడింగ్ టైంలో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1.28 శాతం వృద్ధి చెంది 31.94 డాలర్లు పలికింది.