న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.2,100 తగ్గి రూ.70 వేల దిగువకు రూ.68 వేలకు పడిపోయింది. ఇటు హైదరాబాద్లో మాత్రం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.280 పెరిగి రూ.57,440 పలుకగా..22 క్యారెట్ల ధర రూ.250 అధికమై రూ.52,650కి చేరుకున్నది. వెండి రూ.74 వేలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,875 డాలర్లకు తగ్గగా..వెండి 22.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు గురవుతున్నాయని.. గతవారంలో రికార్డు స్థాయిలో 1,900 డాలర్ల పైకి చేరుకున్న ఔన్స్ ధర ప్రస్తుతం 1,833-1,856 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నదని హెచ్డీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి.