న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బంగారం ధరలు భగభగమండుతున్నాయి. సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుకుంటున్న పుత్తడి మరో మైలురాయికి చేరువైంది. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం కూడా మరో రూ.500 ఎగబాకి రూ.86 వేలకి చేరువైంది. దేశరాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.500 పెరిగి రూ.85,800 పలికింది. ఆభరణాలు, రిటైలర్ల నుంచి డిమాండ్ అత్యధికంగా ఉండటం వల్లనే ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
జనవరి 1 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ ధర రూ.6,410 లేదా 8 శాతం ఎగబాకి రూ. 85,800కి చేరుకున్నది. నెల రోజుల క్రితం ఈ ధర రూ.79,380గా ఉన్నది. గత ఐదురోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి రూ.500 తగ్గి రూ.95,500కి పరిమితమైంది. ధరలు తగ్గకముందు ఇది రూ.96 వేలుగా ఉన్నది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రికార్డు స్థాయి 2,872 డాలర్లకు చేరుకున్నది. కెనడా, మెక్సికో దేశాలపై ట్రంప్ విధించిన పన్ను వాయిదాపడటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.