న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి బుధవారం రూ.1.56 లక్షల స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు దేశీయంగా అంతంత డిమాండ్ ఉండటం వల్లనే ధరలు తగ్గుతున్నాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,100 తగ్గి మూడు వారాల కనిష్ఠ స్థాయి రూ.1,56,100కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.1,58,200గా ఉన్నది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో గోల్డ్ ధర రూ.11 వేలు తగ్గినట్టు అయింది.
ఆగస్టు 25న గోల్డ్ ధర రూ.1,67,100గా ఉండగా, ప్రస్తుతం రూ.1.56 లక్షల స్థాయికి జారుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి రూ.5 వేలు తగ్గి రూ.2,35,500కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.2,40,500గా నమోదైంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమననుండటంతో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలు అతి విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్స్ ధర 25.24 డాలర్లు ఎగబాకి 4,303.12 డాలర్లకు చేరుకోగా, వెండి 63.64 డాలర్లకు పడిపోయింది.