న్యూఢిల్లీ, డిసెంబర్ 9: గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో ధరలు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర మంగళవారం రూ. 1,000 తగ్గి రూ.1,31,600కి పరిమితమైంది. వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ నిర్ణయం కోసం మదుపరులు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండటం వల్లనే ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. దీంతో కిలో ధర రూ.1,80,500కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,85, 000గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ధర 14.83 డాలర్లు తగ్గి 4,205.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బాండ్ ఈల్డ్, ద్రవ్యోల్బణ గణాంకాలతో కమోడిటీ ధరలపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది.