Gold Price | న్యూఢిల్లీ, నవంబర్ 18 : గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. ప్రస్తుత పెండ్లిళ్ల సీజన్కావడంతో ఆభరణాల వర్తకులు, రిటైలర్లు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.400 పెరిగి రూ.77,450కి చేరుకున్నది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ ధర రూ.660 ఎగబాకి రూ.76 వేల పైకి రూ.76,310కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.600 ఎగబాకి రూ.69,950 పలికింది.
బంగారంతోపాటు వెండి కూడా వెలిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,810 అధికమై రూ.92 వేలు పలికింది. అంతకుముందు ఇది రూ.90,190గా ఉన్నది. కానీ హైదరాబాద్లో మాత్రం రూ.99 వేల వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర భారీగా పుంజుకోవడంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడం వల్లనే ధరలు పెరిగాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,600 డాలర్ల పైన కదలాడుతుండగా, వెండి 26 డాలర్ల స్థాయిలో ఉన్నది.