Gold Loans | ప్రతి ఒక్కరికీ కుటుంబ అవసరాల రీత్యా అత్యవసర పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు గానీ, సొంతిల్లు కొనుక్కోవాలని గానీ, పిల్లల విద్యావసరాలకు సరిపడా డబ్బు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బంగారంపై రుణాలు గానీ, పర్సనల్ లోన్లు గానీ తీసుకోవాల్సి వస్తుంది. పర్సనల్ లోన్లతో పోలిస్తే బంగారంపై రుణాలు తేలిగ్గా మంజూరు కావడంతోపాటు వడ్డీ రేట్ల భారం ఎక్కువగా ఉంటుంది. బంగారం తాకట్టుపై కేవైసీ పత్రాలు సమర్పిస్తే చాలు.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలిచ్చేస్తాయి.
గతంతో పోలిస్తే బంగారం తాకట్టు రుణాలు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో బ్యాంకుల్లో బంగారం తాకట్టు రుణాలు 50.4 శాతం వృద్ధి చెందాయి. ఇతర పర్సనల్ లోన్ల సెగ్మెంట్లో కేవలం సింగిల్ డిజిట్ వృద్ధిరేటు నమోదు కావడం ఆసక్తి కర పరిణామం. గత మార్చి నెలాఖరు నాటికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,02,562 కోట్ల బంగారం రుణాలు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 18 నాటికి రూ.1,54,282 కోట్ల విలువైన బంగారం రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. 2023-24లో ఏప్రిల్- అక్టోబర్ మధ్య బంగారం రుణాలతో పోలిస్తే 13 శాతం, వార్షిక ప్రాతిపదికన 56 శాతం వృద్ధిరేటు నమోదైంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ).. అన్ సెక్యూర్డ్ రుణాల కంటే సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో రుణ గ్రహీతలు బంగారం రుణాల వైపు మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే గత ఏడు నెలల్లో ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు 0.7 శాతం తగ్గి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బంగారం ధర పెరగడంతో ఇతర రుణాల గ్రహీతలు పాత రుణాల చెల్లింపునకు బంగారం తాకట్టు రుణాలు తీసుకుంటున్నారని, సెక్యూర్డ్ రుణాలకు మొగ్గు చూపుతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారం రుణాలకు డిమాండ్ పెరగడానికి ఆర్థికంగా దెబ్బ తినడం కూడా కారణం అని కొందరు విశ్లేషకుల అంచనా. బంగారం తాకట్టు రుణాల విధానాలను సమీక్షించుకోవాలని గత నెలలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)ను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం.
ఇక పర్సనల్ లోన్లు 5.6 శాతం పెరిగితే, ఇండ్ల రుణాలు రూ.28.7 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. 2023 అక్టోబర్ నాటితో పోలిస్తే ఇండ్ల రుణాలు 36.6 శాతం, వార్షిక ప్రాతిపదికన 12.1 శాతం వృద్ధి చెందాయి. ఇక క్రెడిట్ కార్డులపై రుణాలు గత ఏడు నెలల్లో 9.2 శాతం పురోగతితో రూ.2.81 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడు నెలల కాలంలో ఆనల్ లైన్ లావాదేవీలు పెరగడంతో క్రెడిట్ కార్డుల రుణాలు కూడా పెరిగాయి. మరోవైపు వ్యక్తిగత రుణాలతోపాటు ఇతర అన్ సెక్యూర్డ్ రుణాలు 3.3 శాతం పతనం అయ్యాయి.