Gold Rates | అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజు మంగళవారం 24 క్యారెట్స్ తులం బంగారం ధర రూ.280 పెరిగి రూ.64,200 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. సోమవారం ముగిసిన ట్రేడింగ్ లో తులం బంగారం ధర రూ.63,920 వద్ద చేరుకున్నది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.300 పుంజుకుని రూ.78,800 పలికింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతోపాటు రూపాయి బలహీన పడటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పైపైకి దూసుకెళ్లింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.
ఫ్యూచర్స్ మార్కెట్.. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లోనూ తులం బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర రూ.208 పెరిగి రూ.63,528 వద్ద స్థిరపడింది. కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర రూ.405 పెరిగి రూ.74,795 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2073 డాలర్లు, ఔన్స్ వెండి 24 డాలర్లు పలికింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.54 శాతం పుంజుకుని 2083 డాలర్ల వద్ద స్థిర పడింది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.100 పెరిగి రూ.59,200 పలకగా, 24 క్యారెట్స్ బంగారం తులం రూ.110 పెరుగుదలతో రూ.64,580 వద్ద స్థిర పడింది. 2023 డిసెంబర్ నాలుగో తేదీన 24 క్యారెట్స్ బంగారం తులం రూ.65,180తో ఆల్ టైం గరిష్ట స్థాయి రికార్డు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం రూ.200 పెరిగి రూ.58,750లకు చేరుకున్నది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.220 పుంజుకుని రూ.64,090.., 2023 డిసెంబర్ నాలుగో తేదీన రూ.64,200 పలికింది.