Gold Imports | పెండ్లిండ్లు.. కుటుంబ వేడుకలు.. అంటే బంగారం.. ఆభరణాల కొనుగోళ్లు.. పుత్తడి అంటే మన అతివలకు ఎంతో ఇష్టం. 2020లో కరోనా వల్ల పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు నామమాత్రంగా సాగాయి. 2020తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగినా 2021లో కాస్త పరిస్థితుల్లో మార్పు కానవచ్చింది. పెండ్లిండ్లు.. శుభకార్యాలు బాగానే జరిగాయి. 2020తో పోలిస్తే గతేడాది బంగారం ధర తక్కువగా ఉండటం కూడా దాని గిరాకీ పెరగడానికి మరో కారణంగా కనిపిస్తున్నది. ఫలితంగా జ్యువెల్లరీ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది.
2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో పుత్తడి దిగుమతి రికార్డులు నమోదు చేసింది. బంగారం దిగుమతులు రెండు రెట్లు దాటాయి. 3800 కోట్ల డాలర్ల విలువ గల బంగారం దిగుమతైంది. 2020-21లో కేవలం 1678 కోట్ల డాలర్ల విలువైన బంగారం మాత్రమే దిగుమతైంది. కేవలం గత నెల (2021 డిసెంబర్)లోనే బంగారం దిగుమతులు 4.8 బిలియన్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.35,705.52 కోట్లు. 2020 డిసెంబర్లో 450 కోట్ల డాలర్ల బంగారం దిగుమతైంది.
2020-21తో పోలిస్తే గత తొమ్మిది నెలల్లో దిగుమతైన బంగారం వల్ల వాణిజ్య లోటు 61.38 బిలియన్ డాలర్ల నుంచి 142.44 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక వెండి దిగుమతులు కూడా 200 కోట్ల డాలర్లకు పెరిగాయి. 2020-21 తొలి తొమ్మిది నెలల్లో 762 మిలియన్ల డాలర్ల విలువైన వెండి దిగుమతైంది. ప్రపంచ దేశాల్లో బంగారం దిగుమతిలో చైనా తర్వాత స్థానం మనదే. ఇక జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 71 శాతం పెరిగి సుమారు 29 మిలియన్ల డాలర్లకు చేరాయి.