Gold Rate | అంతర్జాతీయంగా డాలర్ ధర తగ్గి.. ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం కనిపించినా.. డాలర్ బలోపేతమైనా.. దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్లు) ధర పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2080 డాలర్లు పలికింది. దేశీయంగా పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.61,498 పలికింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి.. అంటే 2024 మార్చి నెలాఖరు కల్లా తులం బంగారం ధర రూ. 66 వేల నుంచి రూ.68 వేలకు దూసుకెళ్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం ధర పెరుగుతున్నా కొద్దీ.. దానిపై పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లకు లాభాల పంట పండుతుంది. 2024 మార్చి నాటికి బంగారంపై పెట్టుబడుల మీద 10-15 శాతం రిటర్న్స్ వస్తాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రుణాలపై సీలింగ్ విధించాలని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదిస్తుందని, తద్వారా డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం, వెండి ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు కమా జ్యువెలరీ ఎండీ కొలిన్ షా. మరో 25 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచాలన్న యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం డాలర్‌ను ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. దాని వల్లే ఔన్స్ బంగారం ధర 2080 డాలర్లకు చేరిందని తెలిపారు. దీని ప్రభావం వల్ల స్వల్ప ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చునన్నారు.
2023లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని కొలిన్ షా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2090-2100 డాలర్లు పలుకవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్-వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది స్పందిస్తూ.. ‘మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెంచవచ్చు’ అని చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతుందని, ఫలితంగా బంగారంపై 10-15 శాతం రిటర్న్స్ ఉండొచ్చునని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తులం బంగారం ధర రూ.66,000-68,000 వరకూ దూసుకెళ్లవచ్చునని తెలిపారు.