Gold | న్యూఢిల్లీ, జనవరి 24: బంగారం భగభగమండుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ఏకంగా రూ.83 వేల మైలురాయిని అధిగమించింది. ఈ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో దేశీయంగా డిమాండ్ ఊపందుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పద్రిగాముల బంగారం ధర రూ.200 ఎగబాకి రూ.83,100 పలికింది.
అంతకుముందు ఈ ధర రూ.82,900గా ఉన్నది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.200 అధికమై రూ.82,700 పలికింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ పదిగ్రాముల బంగారం ధర రూ.330 ఎగబాకి రూ.82,420కి చేరుకోగా, 22 క్యారెట్ ధర మరో రూ.300 అధికమై రూ.75,500గా నమోదైంది. బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ఏకంగా రూ.500 అధికమైంది. బులియన్ మార్కెట్లో వెండి రూ.94 వేలకు చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో కూడా వెండి రూ.1,000 అధికమై రూ.1,05,000 పలికింది.