Gold-Silver Rates | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. రెండురోజులు తగ్గుతూ వచ్చిన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.600 పెరిగి.. తులానికి రూ.1,24,700కి చేరాయి. బలమైన ప్రపంచ సంకేతాలు, వ్యాపారుల నుంచి డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మరో వైపు 22 క్యారెట్ల గోల్డ్ ఖరీదు సైతం రూ.600 పెరిగి తులానికి రూ.1,24,100కి చేరుకుంది. మరో వైపు వెండి పెరిగింది. రూ.1800 పెరిగి కిలో ధర రూ.1,53,300 పలుకుతున్నది. గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం బులియన్ మార్కెట్ మూతపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 28.96 డాలర్లు పెరిగి 4,008.19 డాలర్లకు చేరుకుంది. స్పాట్ సిల్వర్ 1.22 శాతం పెరిగి 48.60 డాలర్లకు చేరింది.
సురక్షిత పెట్టుబడికి స్వర్గధామం కావడంతో డిమాండ్‌కు తోడు.. యూఎస్ డాలర్ స్వల్ప తగ్గుదలతో గురువారం బంగారం ధరలు పైకి కదిలాయి. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్నది. యూఎస్ చరిత్రలోనే సుదీర్ఘంగా షట్డౌన్గా మారింది. ఇప్పటికీ కనుచూపు మేరాలో పరిష్కారం కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. యూఎస్‌లో సుదీర్ఘమైన షట్‌డౌన్ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితికి కారణమైంది.. దాంతో విలువైన లోహాలకు ప్రయోజనం చేకూరుతుందని హెచ్‌డీఎఫ్‌సీలోని సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో డాలర్‌ను కొలిచే డాలర్ ఇండెక్స్.. గరిష్ట స్థాయిని తాకిన తర్వాత 0.29 శాతం పడిపోయి 99.97కి చేరుకుందని.. దాంతో బంగారం, వెండికి ప్రయోజనంగా మారిందన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.1,21,910 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.1,11,750 వద్ద ట్రేడవుతున్నది. ఇక కిలో వెండి కిలోకు రూ.1.64లక్షలుగా ఉన్నది.