న్యూఢిల్లీ, జూన్ 9: ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్.. మంగళవారం దేశ జీడీపీ అంచనాలకు కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత ఆర్థిక వృద్ధిరేటు 6.4 శాతంగానే ఉండొచ్చని అంచనా వేసింది. అంతకుముందు ఇది 6.7 శాతంగా ఉండటం గమనార్హం. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుండటమే తమ అంచనాల్లో తగ్గింపునకు కారణమని ఫిచ్ రేటింగ్స్ పేర్కొన్నది. ఇక ఈ జూలై-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికాలలో దేశ ఆర్థిక వృద్ధి మందగించవచ్చని చెప్తున్నది. ఈ క్రమంలోనే మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరిస్తున్నదిప్పుడు.
గత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈసారి 6.4 శాతమేనని ఫిచ్ అంచనా. దీన్నిబట్టి 1 శాతం వృద్ధిని భారత్ నష్టపోతుండగా.. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండటమే ఈ పరిస్థితికి కారణమని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌కు జరుగుతున్న ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో అగ్ర భాగం కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలదే. అయితే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధంలో ఆయా దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు అండగా ఉంటున్నాయని.. ఇరాన్ వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. దీనివల్ల అక్కడ క్రూడాయిల్, వంటగ్యాస్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. పైగా పెట్రో ఉత్పత్తుల రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిపైనా ఇరాన్ దాడులకు దిగుతుండటం.. భారత్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది.
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు 4-5 శాతం పెరిగిన సంగతి విదితమే. పశ్చిమాసియా సంక్షోభాన్ని చూస్తే.. మున్ముందూ మరిన్ని వడ్డింపులుండటం ఖాయంగానే కనిపిస్తున్నది. దీంతో ద్రవ్యోల్బణం ముప్పు భారత్‌కు గట్టిగానే ఉన్నదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పరుగులు పెడుతున్నాయి మరి. ఇంకా పెరిగితే రాబోయే ద్రవ్య సమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచుతుందని, బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను పెంచుతాయని అంటున్నారంతా. రవాణా వ్యయం పెరిగి ఆయా వస్తూత్పత్తుల తయారీ ఖర్చులూ పెరుగుతుండటంతో మార్కెట్లో అన్నింటి ధరలూ విజృంభిస్తున్నాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి మరింతగా దెబ్బతింటే దేశ జీడీపీలో భారీ పతనం తప్పదన్న సంకేతాలున్నాయని ఫిచ్ కూడా స్పష్టం చేస్తున్నది. మార్కెట్ స్తబ్దత కారణంగా కొత్త పెట్టుబడులూ కష్టమేనంటుండటం ఒకింత కలవరపాటుకే గురిచేస్తున్నది.
‘ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధిరేటు మార్చిలో వేసిన అంచనా కంటే మరో 0.3 శాతం పడిపోవచ్చనిపిస్తున్నది. దేశంలో డిమాండే వృద్ధిరేటు బలోపేతానికి కీలకం’ అని జూన్ నెలకుగాను తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఔట్‌లుక్‌లో ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. గత వారం జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ వృద్ధిరేటు అంచనాను కుదించినది తెలిసిందే. జీడీపీ 6.6 శాతానికే పరిమితం కావచ్చని, ఇదే సమయంలో ద్రవ్యోల్బణం 5.1 శాతానికి ఎగబాకవచ్చని హెచ్చరించింది. ఫలితంగా ఈసారి కీలక వడ్డీరేట్ల జోలికి పోకున్నా.. రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్ల పెంపునకు వీల్లేకపోలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలవగా.. ఇంచుమించు మూడున్నర నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో దేశంలోని ఫారెక్స్ రిజర్వులు సుమారు 50 బిలియన్ డాలర్లు కరిగిపోగా.. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా పెద్ద ఎత్తునే నష్టపోయింది. ఒకానొక దశలో 97 మార్కుకు చేరువవగా.. ఆర్బీఐ జోక్యంతో కోలుకున్నది. బ్యారెల్ ముడి చమురు ధర 125 డాలర్లు పలికింది. దీంతో దేశీయ చమురు దిగుమతులు మరింత ఖరీదెక్కాయి.