Gita Gopinath On Crypto | క్రిప్టో కరెన్సీలను అభివృద్ధి చెందుతున్న దేశాలు నిషేధించడం వల్లే లాభం లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. దానికి బదులు క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై నియంత్రణ తీసుకొస్తే ప్రయోజనం అని స్పష్టం చేశారు. క్రిప్టోలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నదని, దానిపై అంతర్జాతీయ విధానం తేవాల్సిన అవసరం ఉందన్నారు.
గ్లోబల్ రికవరీ అండ్ పాలసీ చాలెంజెస్ ఇన్ 2022 అనే అంశంపై జరిగిన ఓ సదస్సులో ఆమె మాట్లాడుతూ క్రిప్టోల లావాదేవీలు విదేశాల్లో జరుగుతున్నందున వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటిపై గానీ, వాటి ఆస్తులపై గానీ నిషేధం విధించినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నిషేధించినా క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్‌కు అవకాశాలు ఉంటాయని చెప్పారు. అంతర్జాతీయంగా లావాదేవీలు జరిగే క్రిప్టో కరెన్సీల అంశాన్ని ఏ ఒక్క దేశం కూడా పరిష్కరించలేదన్నారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నదని గీతా గోపీనాథ్ గుర్తు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇంతకుముందు క్రిప్టో కరెన్సీ అంశంపై అంతర్జాతీయంగా ఉమ్మడి విధానం అవలంభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌లో క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని డిమాండ్లు వస్తున్న వేళ గీతా గోపీనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్రిప్టో కరెన్సీని కరెన్సీగా కాక, ఆస్తిగా పరిగణించాలని కేంద్రం భావిస్తున్నది. ఆ దిశగా క్రిప్టో కరెన్సీల నియంత్రణకు బిల్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.