ముంబై, ఏప్రిల్ 14 : దేశీయ ఆభరణాల ఎగుమతులకు యుద్ధం సెగ గట్టిగానే తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 35 శాతం తగ్గుముఖం పట్టాయి. మార్చి నెలలో 27,717.40 మిలియన్ డాలర్లకు(రూ.2,44,827.26 కోట్లు) పరిమితమయ్యాయని ఇండస్ట్రీ బాడీ జీజేఈపీసీ తాజాగా వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో 28,669.53 మిలియన్ డాలర్లు(రూ.2,42,559.39 కోట్లు)గా నమోదయ్యాయని జెమ్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన ఎగుమతులు వచ్చే రెండు నుంచి మూడు నెలల వరకు కోలుకునే అవకాశాలు లేవని, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగితే ఎగుమతులు ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవని జీజేఈపీసీ వర్గాలు వెల్లడించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాతనే ఆభరణాల ఎగుమతులు పెరుగనున్నాయన్నారు. మరోవైపు, కట్ అండ్ పాలిష్ డైమండ్ల ఎగుమతులు కూడా 27.48 శాతం తగ్గి 838.75 మిలియన్ డాలర్లకు(రూ.7,798.82 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 1,156.60 మిలియన్ డాలర్లు(రూ.10,002.52 కోట్లు)గా నమోదయ్యాయి.
‘పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయి. డైమండ్ ఎగుమతులు కూడా భారీగా పడిపోయాయి. యుద్ధం రోజురోజుకూ ముదురుతుండటంతో బీమా ప్రీమియం రాకెట్ వేగంతో దూసుకుపోవడం కూడా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. యూఏఈకి చెందిన సంస్థలు భారత్లో డైమండ్ ట్రేడింగ్ చేయడానికి ముందుకు రావడం విశేషం. ఆభరణాలపై అమెరికా అధిక సుంకాన్ని విధించడంతో ఎగుమతులు తగ్గాయి.