కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కంపెనీకి సర్కారీ బ్యాంకులు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశాయి. అవును.. గాయత్రి ప్రాజెక్ట్స్ రుణాల సెటిల్మెంట్ సారాంశం ఇదే.
తీసుకున్న అప్పులు రూ.8,100 కోట్లుగా ఉంటే.. ఇస్తామని ఒప్పుకున్నది రూ.2,400 కోట్లే. దీంతో బ్యాంకులు రూ.5,700 కోట్లు వదులుకోవాల్సి వస్తున్నది. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో కంపెనీ ఉన్న విషయం తెలిసినా భారీ ఎత్తున మోదీ సర్కారు ప్రాజెక్టుల్ని కట్టబెట్టింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 : గాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్‌తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోట్ చేస్తున్న గాయత్రి ప్రాజెక్ట్స్.. బ్యాంకులకు రూ.8,100 కోట్లు బకాయిపడి చేతులెత్తేసింది. ఈ లోన్లను వసూలు చేసుకునేందుకు నానా తంటాలు పడిన బ్యాంకర్లు.. చేసేదేమీ లేక న్యాయ పోరాటానికీ దిగారు. ఏండ్లు గడిచాక మేము ఇంతే ఇవ్వగలమని యాజమాన్యం చెప్పడం.. అదే మహాభాగ్యం అన్నట్టు బ్యాంకులు అంగీకరించడం.. చకచకా జరిగిపోయాయి. చివరకు చూస్తే బ్యాంకులకు వాటిల్లిన నష్టం రూ.5,700 కోట్లు. సామాన్యులు పైసా ఎగ్గొట్టినా ఊరుకోని బ్యాంకర్లు.. చిన్న-సన్నకారు రైతులకు రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయని అదే బ్యాంకర్లు.. కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రుణాలను వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు చేష్టలుడిగే చూస్తున్నారు.
గాయత్రి ప్రాజెక్ట్స్ రుణ బకాయిల సెటిల్మెంట్కు గత వారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన కెనరా, బీవోబీ, పీఎన్బీ తదితర బ్యాంకుల నుంచి గాయత్రి ప్రాజెక్ట్స్ రూ.8,100 కోట్ల లోన్లు తీసుకుని ఎగవేసింది. కెనరా బ్యాంక్ రుణం వాటానే 24 శాతానికి సమానం. తర్వాత బీవోబీ (18%), పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంక్ (11% చొప్పున)లున్నాయి. కాగా, రూ.2,400 కోట్ల వన్-టైం సెటిల్మెంట్ ప్లాన్‌తో ప్రమోటర్లు ముందుకు రాగా, దీనికి 97 శాతం బ్యాంకర్లు అంగీకరించారు. దీంతో చెల్లింపులకు ఎన్సీఎల్టీ 90 రోజుల గడువిస్తూ కేసును సెటిల్ చేసేసింది. రికవరీ రేటు 30 శాతమే.
గాయత్రి ప్రాజెక్ట్స్ రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన ఆస్తుల్ని కొనేవారే కరువయ్యారు. 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు బయ్యర్ కోసం బ్యాంకులు అన్వేషించినా ఫలితం శూన్యం. 2024 జనవరిలో తనఖా పెట్టిన ఆస్తుల విక్రయానికి బ్యాంకులు సిద్ధమవగా, రూ.474 కోట్లతో ప్రభుత్వ రంగ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ముందుకొచ్చింది. అయితే ఈ ఆఫర్‌ను బ్యాంకులు తిరస్కరించాయి. చివరకు బ్యాంకులు, గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రమోటర్ల మధ్య సంప్రదింపులు సఫలం అవగా, రుణ చెల్లింపుల్లో భాగంగా తనఖా పెట్టిన దాదాపు 13 ఆస్తుల్లో ఏడింటిని అమ్మేందుకు గాయత్రి ప్రాజెక్ట్స్‌కు బ్యాంకులు అప్పగిస్తున్నాయి. ఇక రీ-పేమెంట్ ప్లాన్ కింద ప్రమోటర్ల నుంచి బ్యాంకులకు రూ.750 కోట్లు రానున్నాయి. మరో రూ.450 కోట్లు కంపెనీకున్న ఆర్బిట్రేషన్ క్లెయిముల బకాయిల ద్వారా రానుండగా, బ్యాంకుల వద్ద ఇప్పటికే రూ.160 కోట్లను డిపాజిట్, గ్యారంటీ కమీషన్లుగా గాయత్రి ప్రాజెక్ట్స్ పెట్టింది. ఆస్తుల అమ్మకం, మదుపరుల నుంచి నిధుల సమీకరణల ద్వారా మిగతా నగదు చెల్లింపులు (రూ.1,040 కోట్లు) జరుగనున్నాయి.
2015లోనే గాయత్రి ప్రాజెక్ట్స్‌ను ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందులు చుట్టుముట్టినట్టు చెప్తున్నారు. అయినప్పటికీ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆ సంస్థకు మోదీ సర్కారు పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ప్రాజెక్టులను కట్టబెట్టడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ అవినీతిపై గట్టిగా ఆరోపణలు చేసే బీజేపీ అగ్ర నేతలు.. తమకు అనుకూలంగా ఉంటే పార్టీలకతీతంగా మైత్రిని కొనసాగిస్తామని చెప్పకనే చెప్పారు. అయితే కేంద్రం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు.. పలు కీలక ప్రాజెక్టులకు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితుల్ని తెచ్చిపెట్టాయి. ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్‌లోని ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్‌నే చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి 163పై చేపట్టిన ఈ నిర్మాణం బాధ్యతల్ని 2018లో రూ.425 కోట్లకు గాయత్రి గెల్చుకున్నది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా.. కాంట్రాక్టర్‌ను మార్చాలని డిమాండ్లున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఈ ఏడాది మే నెలలో ఫ్లైఓవర్‌ను 10 నెలల్లో పూర్తి చేస్తామంటూ పరోక్షంగా గాయత్రీకి సంబంధిత కేంద్ర మంత్రి మద్దతివ్వడం విశేషం. ఇలా దివాలా తీసిన సంస్థకు ఎన్హెచ్ఏఐ నుంచి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అంతేగాక ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో పలు నీటిపారుదల ప్రాజెక్ట్‌లనూ మోదీ సర్కారు అందించింది. కేవలం ఆరేండ్లలోనే రూ.20వేల కోట్లకుపైగా ప్రాజెక్టులను సొంతంగా, ఆయా సంస్థలతో కలిసి గాయత్రీ ప్రాజెక్ట్స్ సంస్థ పొందింది.
ఉత్తరప్రదేశ్ (ఘాగ్రా-వారణాసి, సుల్తాన్పూర్-వారణాసి)లో రూ.3,318 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టు
రూ.675 కోట్ల ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ 6)
చిత్తూరు ప్రాంతంలోని రూ.306 కోట్ల విలువైన 4 లైనింగ్ హైవై ప్రాజెక్ట్