ముంబై, జూలై 23: రెంటల్ ప్రాపర్టీలకు హైదరాబాద్‌సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో భారీగా డిమాండ్ ఉన్నట్టు ప్రముఖ రియల్టీ పోర్టల్ నోబ్రోకర్ తెలిపింది. ఆన్లైన్లో రెంట్ కోసం ప్రకటన ఇచ్చిన 6 గంటల్లోపలే అద్దెకు పోతున్నట్టు చెప్పింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లోని ట్రెండ్‌ను నోబ్రోకర్ తమ తాజా నివేదికలో తెలియజేసింది. 1.8 కోట్లకుపైగా యూజర్లు తమకున్నట్టు వెల్లడించింది. బ్రోకరేజికి ఎటువంటి రుసుమును నోబ్రోకర్ వెబ్సైట్ తీసుకోదన్న విషయం తెలిసిందే. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో చాలా కంపెనీలు అటు వర్క్ ఫ్రం హోమ్‌కు, ఇటు ఆఫీస్‌లో పని విధానానికి మొగ్గు చూపుతుండటం కూడా రెంటల్ ప్రాపర్టీలకు పెద్ద ఎత్తున ఆదరణ తెచ్చిపెట్టిందని ఈ సందర్భంగా నోబ్రోకర్ అభిప్రాయపడింది.
ఈ క్రమంలోనే ప్రతి నెలా 2.5 లక్షలకుపైగా రెంటల్ పోస్టింగ్స్ వస్తున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ అగర్వాల్ పీటీఐకి తెలిపారు. ఏప్రిల్-జూన్‌లో తమ నోబ్రోకర్ వేదికపై పెట్టిన ప్రాపర్టీల్లో 40 శాతం.. కేవలం 6 గంటల్లోగా అద్దెకు పోయాయని చెప్పారు. అలాగే కరోనాకు ముందున్న పరిస్థితులతో పోల్చితే బెంగళూరులో రెంటల్స్ అత్యధికంగా ఐదు రెట్లు పెరిగాయన్నారు. మిగతా 5 నగరాల్లో మూడు రెట్లు పెరిగాయి. ఏప్రిల్‌లో నమోదైన 24 గంటల్లోపే బెంగళూరులో 18వేల ప్రాపర్టీలు అద్దెకు పోయాయని వివరించారు. చెన్నైలో ఇది 7,000-8,000లుగా ఉంటే.. పుణె, హైదరాబాద్‌ల్లో 5,000లుగా ఉన్నది. గేటెడ్ కమ్యూనిటీల్లోని అపార్టుమెంట్లకు గిరాకీ బాగా ఉందని అగర్వాల్ వెల్లడించారు. 10-15 శాతం అద్దెలు కూడా పెరిగాయన్నారు.