Financial Tasks | 2023కి గుడ్ బై చెప్పి కొత్త వసంతంలోకి వచ్చేశాం. నూతన సంవత్సరానికి క్యాలండర్ మారడంతోపాటు ఆర్థికాంశాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలు మొదలు సిమ్ కార్డ్ జారీ కోసం కొత్త నిబంధనలు.. తదితర అంశాల్లో నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవేమిటో ఓసారి పరిశీలిద్దామా..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేంద్రం వడ్డీరేట్లు సవరించింది. బాలికల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకంపై వడ్డీరేటు 20 బేసిక్ పాయింట్లు పెరిగింది. ఇంతకుముందు ఎనిమిది శాతం ఉంటే, ఇప్పుడది 8.2 శాతానికి చేరుకున్నది. మరోవైపు మూడేండ్ల గడువు గల టర్మ్ డిపాజిట్‌పై పది బేసిక్ పాయింట్ల వడ్డీరేటు పెంచింది. దీంతో ఈ పథకంపై వడ్డీరేటు ఏడు శాతం నుంచి 7.1 శాతానికి చేరుకున్నది. సవరించిన కొత్త వడ్డీరేట్లు జనవరి-మార్చి త్రైమాసికానికి వర్తిస్తాయి.
ఏడాది కాలానికి పైగా పని చేయకుండా ఉన్న గూగుల్ పే, పేటీఎం, భారత్ పే, ఫోన్ ఫో వంటే యూపీఐ యాప్ ఆధారిత ఐడీలు, యూపీఐ నంబర్లు నేటి నుంచి డీయాక్టివేటవుతాయి. ఈ విషయమై గత నవంబర్ ఏడో తేదీనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆదేశాలిచ్చింది.
ముడి సరుకు ధరలు పెరగడంతో వాహనాల తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో పలు సంస్థల కార్ల ధరలు పెరగనున్నాయి. వాటిల్లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్, ఆడి వంటి కార్ల తయారీ సంస్థల యాజమాన్యాలు.. జనవరి నుంచే ధరలు పెరుగుతాయని ప్రకటించాయి. ఫలితంగా కార్ల ధరలు రెండు లేదా మూడు శాతం పెరుగుతాయి.
కొత్తగా ఎవరైనా మొబైల్ సిమ్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ పత్రాల ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ చేస్తే సరిపోయేది. కానీ, రోజురోజుకు సిమ్ కార్డులతో సైబర్ మోసాలు జరుగుతుండటంతో డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చింది. అంటే మొబైల్ ద్వారానే టెలికం కంపెనీలు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేస్తాయి.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అవసరం. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారికి ఆయా పాలసీల గురించి తేలిగ్గా అర్థమయ్యేలా ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)’ విడుదల చేయాలని బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సూచించింది. ఈ నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది.