శుక్రవారం 10 జూలై 2020
Business - May 30, 2020 , 00:27:01

డ్రోన్ల ద్వారా సరుకు రవాణా

డ్రోన్ల ద్వారా సరుకు రవాణా

  • -ట్రయల్స్‌కు అనుమతి పొందిన స్పైస్‌జెట్‌

న్యూఢిల్లీ, మే 29: దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలతోపాటు నిత్యావసర వస్తువులను, ఈ-కామర్స్‌ సరఫరాలను వేగవంతంగా పంపిణీ చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని దేశీయ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్‌' యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్‌ను నిర్వహించేందుకు డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నుంచి స్పైస్‌జెట్‌ అనుమతి పొందింది. రిమోట్‌తో నడిచే ఎయిర్‌క్రాఫ్ట్‌ (డ్రోన్‌)ల ద్వారా ప్రయోగాత్మకంగా బీవీఎల్‌ఓఎస్‌ (బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌) ఆపరేషన్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలియజేస్తూ స్పైస్‌జెట్‌ సరుకు రవాణా విభాగమైన ‘స్పైస్‌ ఎక్స్‌ప్రెస్‌' డీజీసీఏకి ఈ ప్రతిపాదనను సమర్పించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం తక్కువ ఖర్చుతో సరుకులను రవాణా చేసేందుకు డ్రోన్‌ టెక్నాలజీని పరీక్షించడం గగనతల రవాణా రంగంలో పెద్ద ముందడుగని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆహార పదార్ధాలు, ఔషధాలు, ఇతర సరుకుల రవాణా కోసం ఈ ఆధునిక విధానాన్ని ఉపయోగించేందుకు తాము ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు.


logo