FPI Investments | ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.5,254 కోట్ల విలువైన షేర్లు విక్రయించారని నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో గణనీయంగా దేశీయ స్టాక్స్ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు అంతకుముందు జనవరిలో షేర్లు విక్రయించారు. మద్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు షేర్ల విక్రయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ విక్రయించగా, మరోవైపు ఆటో, టెలికం స్టాక్స్ కొనుగోలు చేశారు.
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐటీ సంస్థల ఆర్థిక ఫలితాల్లో పేలవమైన ఫలితాలు రావడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల వైఖరిలో మార్పు వచ్చింది. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు షేర్ల విక్రయానికి పాల్పడుతున్నారు. ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురైతే, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెలికం, ఫైనాన్సియల్ సర్వీసెస్, పవర్ స్టాక్స్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిక్ వీకే విజయకుమార్ తెలిపారు.
భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి సాధిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.4 శాతానికి పెరగడం ద్వారా ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాజకీయ సుస్థిరత, నియంత్రణ స్థాయిలోకి ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధిరేటు అంచనాలు తదితర పరిణామాలు భవిష్యత్‌లోనూ దేశ ఆర్థిక వృద్ధి కొనసాగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.