FPI | కెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్‌లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తదితర అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల ఉపసంహరణ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.7,300 కోట్ల (840 మిలియన్ డాలర్లు) విలువైన పెట్టుబడులను ఉపసంహరించారు. జనవరిలో రూ.78,027 కోట్ల విలువైన వాటాల ఉపసంహరణకు కొనసాగింపుగా ఈ నెల ఏడో తేదీ వరకూ రూ.7,342 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించారు.
డిసెంబర్ నెలలో రూ.15,446 కోట్ల విలువైన ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ సూక్ష్మ, ఆర్థిక పరిణామాలు, దేశీయ ప్రభుత్వ విధానాలను బట్టి మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఉంటుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సుంకాలు విధించడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ గత వారం రూ.87 కంటే దిగువకు పడిపోయి.. జీవిత కాల కనిష్ట స్థాయికి పరిమితమైంది. ఫలితంగా యూఎస్ బాండ్ల విలువ పెరుగుదల, డాలర్ విలువ బలోపేతం కావడంతో ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణకు మరో కారణం అని చెబుతున్నారు.
ఇక దేశీయంగా రెపోరేట్ 6.5 నుంచి 6.25 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో మార్కెట్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేట్, కార్పొరేట్ సంస్థల మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రికవరీ ఆధారంగా మార్కెట్లు పుంజుకుంటాయని అంచనా వేశారు.