FPI | ఈక్విటీ మార్కెట్లలోకి సెప్టెంబర్ నెలలో రూ.57,359 కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) వచ్చి చేరాయి. గత తొమ్మిది నెలల్లో ఇదే గరిష్టం. కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడంతోపాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండటం వల్లే విదేశీ ఇన్వెస్టర్లు భారత్ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 27 నాటికి ఈ నెలలో రూ.57,359 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి. గతేడాది డిసెంబర్ తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి అత్యధికంగా పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. 2023 డిసెంబర్లో రూ.66,135 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నిధులు ఉపసంహరించుకున్నా, జూన్ నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. జనవరి, ఏప్రిల్, మే నెలలు మినహా మిగతా ఆరు నెలల్లో ఎఫ్‌పీఐలు స్థిరంగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఏప్రిల్-మే నెలల్లో రూ.34,252 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.