పాలకుర్తి, అక్టోబర్ 23 : బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరాం సిమెంట్ కర్మాగారాన్ని నిర్మించి, 40 ఏండ్లు అన్నీ తానై నడిపిన కేసీ జైన్ (85) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. 1968లో బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరాం సిమెంట్ కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినప్పటి నుంచి 2018 వరకు సుమారు 50 ఏండ్ల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కర్మాగారం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టు పక్కల గ్రామాల్లో వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. బీకే బిర్లా గ్రూప్ అధినేత బసంత్‌కుమార్ బిర్లాకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, కంపెనీలోని కేశోరాం గ్రూప్‌నకు డైరెక్టర్‌గా, బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంతోపాటు, కర్ణాటక రాష్ట్రం సేడెం జిల్లాలోని వాసవదత్తా సిమెంటు, రాజస్థాన్ రాష్ట్రంలోని మంగళం సిమెంట్ కర్మాగాన్ని నడిపించారు.