ముంబై, జనవరి 19: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) తిరిగి పెరిగాయి. ఈ నెల 12తో ముగిసిన వారంలో ఇవి 1.63 బిలియన్ డాలర్ల మేర పెరిగి 618.94 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అంతక్రితం వారంలో ఇవి భారీగా 5.89 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత మళ్లీ ఆ స్థాయికి నిల్వలు కోలుకోలేదు. ఒకదశలో ఇవి 520 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి. అటుతర్వాత క్రమేపీ కోలుకుని రికార్డుస్థాయిని సమీపిస్తున్నాయి.ఈ జనవరి 12తో ముగిసిన వారంలో విదేశీ నిల్వల్లో అధికభాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.859 బిలియన్ డాలర్లు పెరిగి 548.508 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ మారకంలో వెల్లడించే విదేశీ కరెన్సీ ఆస్తుల్లో..అమెరికాయేతర కరెన్సీల విలువల్లో ఏర్పడిన పెరుగుదల లేదా తరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు.
బంగారం నిల్వల్లో తరుగు
సమీక్షా వారంలో ఆర్బీఐ వద్దనున్న బంగా రం నిల్వలు మాత్రం తరిగిపోయాయి. ఇవి 242 మిలియన్ డాలర్ల మేర క్షీణించి 47.247 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్ వద్ద ఉంచిన రిజర్వుల విలువ 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.