Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సెప్టెంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.335 బిలియన్ డాలర్లు తగ్గి 590.702 బిలియన్ డాలర్లకు పడిపోయాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. ఇంతకుముందు వారం సైతం ఫారెక్స్ నిల్వలు 867 మిలియన్ డాలర్లు పతనమై 593.037 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. 2021 అక్టోబర్ లో 645 బిలియన్ డాలర్లకు చేరిన ఫారెక్స్ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ఒత్తిళ్లు, అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం, క్రూడాయిల్ ధరల్లో అనిశ్చితి తదితర పరిణామాలతో గతేడాది కాలంగా ఫారెక్స్ నిల్వలు రోజురోజుకు తగ్గూతునే ఉన్నాయి.
సెప్టెంబర్ 22 నాటికి ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.552 బిలియన్ డాలర్లు తగ్గి 523.363 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం నిల్వలు మాత్రం 307 మిలియన్ డాలర్లు పెరిగి 44.307 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 79 మిలియన్ డాలర్లు తగ్గి 18.012 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఐఎంఎఫ్‌లో 11 మిలియన్ డాలర్లు తగ్గి 5.019 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ డేటా చెబుతోంది.