Ford | న్యూఢిల్లీ/చెన్నై, సెప్టెంబర్ 11: భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పిన అగ్రరాజ్యం ఆటో దిగ్గజం ఫోర్డ్.. త్వరలోనే రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆ సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంతో మూడు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని, చెన్నైలోని ప్లాంట్‌ను తిరిగి తెరవాలని స్టాలిన్ కోరారు.
ఈ మేరకు తమిళనాడు సీఎం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో ఫోర్డ్ పునరాగమనంపై తిరిగి అంచనాలు ఏర్పడుతున్నాయి. కాగా, 2021లో భారతీయ మార్కెట్ నుంచి ఫోర్డ్ వైదొలగిన విషయం తెలిసిందే. భారీ నష్టాలతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేగాక చెన్నైలోని తమ ప్లాంట్‌నూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు అమ్మాలనుకున్నది. అయితే గత ఏడాది డిసెంబర్లో ఈ ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కొత్త ప్రణాళికలకు శ్రీకారం కూడా చుట్టింది. అయితే మళ్లీ పెద్దగా కదలికలేవీ లేకపోవడంతో ఫోర్డ్ రాక సందిగ్ధంలో పడింది. కానీ స్టాలిన్ అభ్యర్థనకు ఫోర్డ్ నుంచి సానుకూల స్పందనే వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో ఫోర్డ్‌పై మళ్లీ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇదిలావుంటే చెన్నై ప్లాంట్‌లో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)ను తయారు చేసేందుకు ఫోర్డ్ ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. 1990లో ఫోర్డ్.. భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. 2019లో మహీంద్రా అండ్ మహీంద్రాతో జట్టు కట్టినా కలిసిరాలేదు. కరోనా పరిస్థితుల నడుమ పూర్తిగా దేశీయ మార్కెట్‌కు దూరమైంది.