న్యూఢిల్లీ, మే 30: అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ను టాటా మోటర్స్ చేజిక్కించుకోనుంది. ఈ మేరకు ఫోర్డ్, గుజరాత్ ప్రభుత్వంతో టాటా మోటర్స్ సోమవారం ఒక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసింది. తమ సబ్సిడరీ కంపెనీ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్), ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగినట్టు టాటా మోటర్స్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
ఒప్పందం ప్రకారం ఎఫ్ఐపీఎల్కు సనంద్‌లో వున్న వాహన తయారీ ప్లాంట్, భూమి, భవనాలతో సహా తాము టేకోవర్ చేస్తామన్నది. 2011లో గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఫోర్డ్ కార్యకలాపాలు ప్రారంభించిన సనంద్‌లో 350 ఎకరాల్లో వాహన అసెంబ్లింగ్ ప్లాంట్, 110 ఎకరాల్లో ఇంజిన్ తయారీ ప్లాంట్ విస్తరించి ఉన్నాయి. తమ చెన్నై, సనంద్ ప్లాంట్లలో వాహన ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు గతేడాది సెప్టెంబర్‌లో ఫోర్డ్ ప్రకటించింది. దేశంలో కేవలం దిగుమతి చేసుకున్న కార్లనే విక్రయించాలని నిర్ణయించింది. అయితే సనంద్‌లో ఇంజిన్ల తయారీని కొనసాగిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఇకముందు ఇంజిన్ల తయారీ జరుపుతున్న భూమిని ఫోర్డ్‌కు టాటా మోటర్స్ లీజుకు ఇవ్వనుంది. తాజాగా టేకోవర్ చేస్తున్న వాహన తయారీ ప్లాంట్‌లో కొత్త యంత్రాలు, పరికరాల కోసం పెట్టుబడి చేయనున్నట్టు టాటా తెలిపింది. ఫోర్డ్ ప్లాంట్ ను టాటాలు కొనుగోలు చేయడంతో ఉపాధి నష్టం ఉండదని గుజరాత్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌కుమార్ తెలిపారు. ఫోర్డ్ ప్లాంట్ ద్వారా 3,000 మంది ప్రత్యక్షంగా, 20,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.