ముంబై, నవంబర్ 13: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు మార్కెట్లు భీకర నష్టాల్లో నడుస్తున్నా.. మదుపరులు మాత్రం ఈ కంపెనీ షేర్లను ఎగబడి కొనేశారు. దీంతో తొలిరోజే షేర్ విలువ దాదాపు 17 శాతం పెరిగింది. బీఎస్ఈలో ఇష్యూ ధర కన్నా 5.64 శాతం ఎగిసి రూ.412 వద్ద, ఎన్ఎస్ఈలో 7.69 శాతం ఎగబాకి రూ.420 వద్ద లిస్టింగైంది. చివరకు బీఎస్ఈలో 16.91 శాతం పుంజుకొని రూ.455.95 వద్ద ముగియగా, ఒకానొక దశలో రూ.465.30ను తాకింది. అలాగే ఎన్ఎస్ఈలో 16.92 శాతం వృద్ధితో రూ.456 వద్ద నిలిచింది. స్విగ్గీ ఇష్యూ ధర రూ.390గా ఉన్నది. ఇక బంపర్ సక్సెస్తో కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్లు దాటి రూ.1,02,062.01 కోట్లకు చేరింది. మరోవైపు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ కింద అర్హులైన ఉద్యోగులకు స్విగ్గీ కేటాయించిన షేర్ల విలువ ఇప్పుడు భారీగా పెరగడంతో వారంతా కోటీశ్వరులైయ్యారు. 500 మంది దగ్గర రూ.2 కోట్ల విలువైన షేర్లున్నట్టు సమాచారం. ఇక స్విగ్గీ విజయం సాధించడంతో దాని ప్రత్యర్థి సంస్థ జొమాటో శుభాకాంక్షలు తెలిపింది. జొమాటో మార్కెట్ విలువ రూ. 2,28,463.62 కోట్లుగా ఉన్నది.