Foldable iPhone | మార్కెట్లో ఆపిల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో మొబైల్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటి వరకు శామ్సంగ్, వన్‌ప్లస్ తదితర కంపెనీలు ఫోల్డబుల్ మొబైల్స్‌ని పరిచయం చేశాయి. ఆపిల్ మాత్రం ఫోల్డబుల్‌పై దృష్టి మాత్రం సారించలేదు. ప్రస్తుతం కంపెనీ ఫోల్డబుల్ మోడల్‌పై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ని 2026 నాటికి లాంచ్ చేయనున్నదని ఓ నివేదిక తెలిపింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ గత కొద్దిరోజులుగా స్థిరమైన వృద్ధిని సాధించింది. ఈ రంగంలో శాంసంగ్, హువావే, మోటరోలా తదితర ప్రధాన కంపెనీలు ముందున్నాయి. శామ్సంగ్ జెడ్-సిరీస్‌తో మార్కెట్లో ముందంజలో ఉన్నది. ప్రతి కొత్త వెర్షన్‌తో డిజైన్‌తో పాటు క్వాలిటీని సైతం మెరుగుపరుస్తూ వస్తున్నది.
ఆపిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుందన్న వార్త వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్లో కొత్త అవకాశాలను తెరిచి, యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని నివేదిక పేర్కొంది. ఇటీవల డీఎస్సీసీ (డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్) నివేదిక 2019 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం 40 వృద్ధి చెందుతున్న తర్వాత.. 2024లో మార్కెట్ కేవలం 5శాతం పెరుగుతుందని అంచనా వేస్తూ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సవాళ్లను హైలైట్ చేసింది. 2024లో థర్డ్ క్వార్టర్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేల డిమాండ్ సంవత్సరానికి 38శాతానికి తగ్గింది. ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే మిలియన్ల సార్లు ఫోల్డ్ చేసినా ఎలాంటి నష్టం లేకుండా పని చేస్తుంది. ఆపిల్ కొత్త డిజైన్.. ప్రస్తుత ఐఫోన్ పీచర్స్, కొత్త ఫోల్డింగ్ మెకానిజానికి జోడించడం ద్వారా ఓ ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అందించనున్నది. ఆపిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వస్తే మార్కెట్‌పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆపిల్ ఉత్పత్తులు మార్కెట్లకు భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.