Halwa Ceremony | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సంప్రదాయ ‘హాల్వా’ తయారీ వేడుకలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ఆమె పార్లమెంట్‌కు సమర్పిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఎనిమిదో వార్షిక బడ్జెట్ ఇది. 2025-26 బడ్జెట్ తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో శుక్రవారం హాల్వా తయారీ వేడుక నిర్వహించారు. దేశ రాజధానిలోని నార్త్‌బ్లాక్‌లోని గల ఆర్థికశాఖ కార్యాలయంలో హాల్వా వేడుక జరిగింది.
బడ్జెట్ తయారీలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాల్వా తయారీలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. అందరినీ పలుకరిస్తూ హాల్వా వడ్డించారు. హాల్వా తయారీ వేడుక ముగియడంతో ఆర్థికశాఖ పరిధిలో బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోతారు.
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించిన తర్వాత వారు తమ ఇండ్లకు వెళతారు. కాగా, హాల్వా తయారీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి తహిన్ కాంతా పాండే, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 2021 నుంచి డిజిటల్ ఫార్మాట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తుండటంతో బడ్జెట్ ముద్రణ నిలిచిపోయింది కానీ, సంప్రదాయ హాల్వా తయారీ వేడుక మాత్రం కొనసాగుతోంది.