హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విమానాశ్రయం నుంచి న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇండిగో 6ఇ 6145 విమాన సర్వీసు హైదరాబాద్ నుంచి 179 మంది ప్రయాణికులతో బీచ్ గమ్యస్థానమైన గోవాకు ఉదయం 7.40 గంటలకు బయలుదేరి వెళ్లింది. ఇండిగోతోపాటు గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సైతం గురువారం న్యూ గోవాకు రోజువారి విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి గోవాకు ప్రయాణించే పర్యాటకుల సంఖ్య చాలా గణనీయంగా ఉందని, ఈ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉందన్నారు.