Villa with Canadian Wood | విదేశీ మార్కెట్లలో అటవీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మాక్ ప్రాజెక్ట్స్‌తో బ్రిటిష్ కొలంబియా (బీసీ) ప్రభుత్వ సంస్థ కెనడియన్ వుడ్ జత కట్టింది. అందుకోసం బీటీఆర్ గార్డెన్స్‌లో కెనడియన్ ఉడ్ విల్లాలను ప్రారంభించింది. హైదరాబాద్ నాలెట్జ్ సిటీ నడిబొడ్డున గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో మాక్ ప్రాజెక్టుతో 250 ఎకరాలకు పై చిలుకు విస్తీర్ణంలో బీటీఆర్ గార్డెన్స్ విల్లాల నిర్మాణం చేపట్టింది. అన్ని రకాల నగర లగ్జరీలను ఆఫర్ చేస్తూ 300 ప్రీమియం విల్లాలను నిర్మించనున్నది.
2022 జనవరి నాటికి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి కానున్నది. బుకింగ్స్‌కు అనుగుణంగా విల్లాల నిర్మాణం కొనసాగుతుంది. ఒక ఇంటి నిర్మాణానికి ఆరు నెలల సమయం పడుతుంది. భారత్‌లో కెనడియన్ ఉడ్కు పెట్టింది పేరు ఎఫ్ఐఐ. బీసీ వుడ్ విస్తృత శ్రేణి అప్లికేషన్లను ఇండ్ల నిర్మాణంలో కెనడియన్ వుడ్ చురుగ్గా ప్రోత్సహిస్తోంది. కెనడియన్ స్పృస్ పైన్ ఫిర్తో అనే వుడ్ విడి భాగాలతో వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో ఈ విల్లాల నిర్మాణం జరుగుతుంది. కెనడియన్ వుడ్ నుంచి ఈ విల్లాల నిర్మాణంలో అన్ని రకాల టెక్నికల్, మెటీరియల్ సాయం అందుతుంది.
కెనడియన్ వుడ్ కంట్రీ డైరెక్టర్ ప్రనేశ్ ఛిబ్బర్ మాట్లాడుతూ భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కాంక్రీట్‌తో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం గమనించాం.. వుడ్‌తో ఇండ్ల నిర్మాణానికి స్థానిక నైపుణ్యం, పరిజ్ఞానం కల వారి మద్దతు కోరుతున్నాం. అందుకే దేశంలో ఎఫ్ఐఐతో కలిసి శక్తి సామర్థ్యాలు గల బిల్డర్లు, కాంట్రాక్టర్లతో పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాం. సెమినార్ల ద్వారా శిక్షణ అందిస్తాం. వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం. స్థానికంగా అందుబాటులో ఉన్న ఉత్తమ పద్దతులను షేర్ చేసుకుంటాం అని తెలిపారు.
కెనడా నుంచి వుడ్‌తో ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ నిపుణులను డెవలపర్లకు మద్దతుగా అందుబాటులోకి తెస్తున్నాం. మా ప్రయత్నాల్లో భాగంగా మాక్ ప్రాజెక్టుతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నాం అని ప్రనేశ్ ఛిబ్బర్ చెప్పారు.
మాక్ ప్రాజెక్ట్స్ ఎండీ కం ప్రమోటర్ డాక్టర్ నవాబ్ మిర్ నాసిర్ అలీఖాన్ మాట్లాడుతూ.. వుడ్ స్థిరమైన సంప్రదాయేతర ప్రకృతి భవననిర్మాణ సామగ్రి. కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల సాధనకు అందుబాటులో ఉన్న కొద్ది ప్రకృతి ద్వారా లభించే వస్తువుల్లో వుడ్ ఒకటి అని చెప్పారు.